- స్థానిక వ్యాపారుల సమ్మతితోనే చెన్నూరులో రోడ్డు వెడల్పు
- డీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీడర్ల హెచ్చరిక
చెన్నూరు, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బాల్క సుమన్, బీఆర్ఎస్ లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఆయన వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కోటపల్లి బస్టాండ్ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే బాల్క సుమన్సూచనతో కొందరు బీఆర్ఎస్ లీడర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్అయ్యారు. రోడ్డు విస్తరణతో స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని.. కోటపల్లి, వేమనపల్లి, మహారాష్ట్రకు రవాణా వ్యవస్థ మెరుగవుతుందన్నారు.
మంత్రి వివేక్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో మూడుసార్లు చర్చించి, నష్టపోకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చి అందరికి నోటీసులు ఇచ్చాకే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని స్పష్టం చేశారు. కొవిడ్సమయంలో నోటీసులు ఇవ్వకుండానే క్యాంప్ఆఫీస్ ముందు చిరు వ్యాపారులను బలవంతంగా తొలగించిన చరిత్ర బాల్క సుమన్దని విమర్శించారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మరోసారి మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు ఎ.శంకర్, పి.సాగర్,అజ్జు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, రాకేశ్, సుశీల్ కుమార్, అన్వర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
